Translate

Thursday, November 17, 2011

మరిచిపోలేని మా మాస్టారు ఎమ్వీయల్ గారు

మ్వీయల్ గారు ఇంటర్మీడియట్ లో రెండేళ్ళ పాటు మా లెక్చరర్ అయినప్పటికీ ఆయనతో  వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోలేకపోయాను.   అసలా ఆలోచనే  రాలేదు.  ఇప్పుడు తల్చుకుని మాత్రం ఏం లాభం?  ఆయన పాఠాలు విన్న అసంఖ్యాకమైన విద్యార్థుల్లో ఒకడిగా మాత్రమే మిగిలాను.      

ఎమ్వీయల్ గారిని  ప్రత్యక్షంగా  చూడకముందే  ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఆయన నిర్వహించిన  ‘యువజ్యోతి’ శీర్షిక  తెలుసు.  చిలిపి, సరదా, సీరియస్ ప్రశ్నలకు చురకల, చమత్కారాల హుషారు జవాబులు చదివి ఆనందించేవాణ్ణి.  

‘ఎమ్వీయల్’ అని పేరు రాసుకోవటంలోనే ఓ ప్రత్యేకత!  అయితే ఆయన పూర్తి పేరు ఏమిటో తెలిసేది కాదు.  MVL  అనేది అబ్రివియేషన్ అనే ఆలోచనతో దానిలోనే పేరుందని భావించి  ఆ పేరును రకరకాలుగా ఆలోచించటానికి ప్రయత్నించేవాణ్ణి;  ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయేవారు.  ఆంధ్రజ్యోతిలో కూడా ఎమ్వీయల్ అని తప్ప మరే రకమైన వివరమూ ఉండేది కాదు.

‘ముళ్ళపూడి వెంకట’ దాకా ఊహించటం... తర్వాత ‘రమణ’ అనుకోవాలంటే  ‘ఆర్’కు  బదులుగా  ‘ఎల్ ’వచ్చి అడ్డుగా నిలబడేది.  దీనికి తోడు యువజ్యోతి శీర్షికలోనే  ‘మీ పేరు ముళ్ళపూడి వెంకట రమణా?’ అని ఓ పాఠకుడు/ పాఠకురాలు అడగటం.... దానికి ‘ఔను. చిన్నప్పట్నుంచీ నాకు ‘ర’ పలికేది కాదు. ‘ముళ్ళపూడి వెంకట లమణ’ అని పలికేవాణ్ణి. అలా ఎమ్వీయల్ అనే పేరొచ్చింది’’.అంటూ కొంటె సమాధానం చెప్పటం !

దీంతో నా తికమక అలాగే కొనసాగింది, చాలా రోజులదాకా!

లెండింగ్ లైబ్రరీ దగ్గర....
మొదటి సారి ఆయన్ను నా పదో తరగతి పరీక్షలు రాయటానికి  నూజివీడులో కొద్ది రోజులున్నపుడు  చూశాను.  ధర్మ అప్పారావు కాలేజీకి రెండు వీధుల అవతల తెలుగు నవలలు అద్దెకిచ్చే లెండింగ్ లైబ్రరీ ప్లస్  కిళ్ళీ బడ్డీ ఉండేది.  అక్కడకు వెళ్ళి,  ఆ పుస్తకాలను మురిపెంగా  చూస్తూ  సంతోషిస్తూ ఉండగా దూరంగా ఓ వ్యక్తి  అటువైపే  వస్తూ కనిపించారు. కిళ్ళీ కొట్టతను ‘ఆయనే ఎమ్వీయల్ గారు’ అని పక్కనున్న అతనితో  చెప్పారు. వినగానే ఎలర్ట్  అయిపోయాను.  ఆయన  సరాసరి ఆ కిళ్ళీ బడ్డీ దగ్గరకే వచ్చి ఆగారు.   

ఆకర్షణీయమైన రూపం... చురుకైన కళ్ళు...  మొహంలో  గాంభీర్యం!  సాదాసీదా మనిషిలా  కాకుండా  ప్రత్యేకమైన వ్యక్తిలాగా కనిపించారు.  

అంత దగ్గరగా ఆయన వచ్చి నిలబడినప్పటికీ  ఆయన్ను పరిచయం చేసుకునేంత చొరవ, ధైర్యం ఏమాత్రం  లేవప్పుడు.  అలా  పరిచయం చేసుకుని,  నాలుగు మాటలు మాట్లాడవచ్చని కూడా  తెలియదు. (ఆయన యువజ్యోతి గురించి నాకు అప్పటికే తెలుసు కాబట్టి పలకరించటానికి ఆమాత్రం సరిపోతుందసలు.)  పైగా వల్లమాలిన బిడియం  నిలువెల్లా ఆవహించివున్న వయసది.  మౌనంగా  పక్కనుంచి  ఆయన్ను అలా  చూస్తుండిపోయాను.  ఆయన అక్కడ కిళ్ళీ కట్టించుకుని  కొద్ది నిమిషాల తర్వాత అక్కణ్నుంచి కదిలి, బహుశా కాలేజీ దారిలోనే ముందుకు సాగిపోయారు! 

తర్వాత కొద్ది రోజులకు నూజివీడులోనే  కాలేజీ వార్షికోత్సవానికి సరదాగా మిత్రుడితో కలిసి వెళ్ళాను. దూరంగా ఉన్న  వేదిక మీద ముఖ్య అతిథి  జంధ్యాల. దర్శకుడిగా ఆయన  తొలిచిత్రం- ‘ముద్ద మందారం (1981) ’రూపొందించిన  సమయమది. అప్పటికింకా సినిమా  విడుదల కాలేదనుకుంటాను.  ఆ కార్యక్రమంలో జంధ్యాల ఏం మాట్లాడారో జ్ఞాపకం లేదు కానీ, ఎమ్వీయల్ గారు జంధ్యాలను పరిచయం చేస్తూ చేసిన  ప్రసంగం గుర్తుంది. అలా ఆయన  ఉపన్యాసం తొలిసారిగా విన్నాను.  జంధ్యాల విశిష్టతను చెపుతూ ఉపయోగించిన ‘రస ప్లావితం’అనే మాట బాగా గుర్తు.

నూజివీడు లాంటి చిన్న పట్టణంలోని కాలేజీ ప్రోగ్రాంకి  సినీ, సాహిత్య  ప్రముఖులు ప్రతి సంవత్సరం హాజరయ్యేవారంటే దానికి  ఎమ్వీయల్ గారితో వారికున్న  పరిచయాలే  కారణం! 

టెన్త్ ఫలితాలు వచ్చాక మా ఊరికి  30 కిలో మీటర్ల దూరంలో ఉన్న  నూజివీడు కాలేజీ లోనే ఇంటర్లో చేరాను.  అక్కడ ఎమ్వీయల్ గారు లెక్చరర్ అని తెలుసు కాబట్టి  బాగా ఉత్సాహం.  ఆయన తరగతులు వినాలనే ఆసక్తితో  సంస్కృతాన్ని కాదనుకుని  తెలుగును రెండో భాషగా తీసుకున్నాను.

అనుమానం.. ప్రశంస
ఆయన మొదటిసారి మా ఇంటర్మీడియట్ క్లాసుకు వచ్చినపుడు ఓ సంఘటన జరిగింది. 

పాఠం చెప్పి,  దాని ఆధారంగా  వ్యాసం రాసుకురమ్మన్నారు.  అప్పటికే  కథలూ, నవలలూ  బాగా చదివే అలవాటు ఉండటం వల్ల  అదే ధోరణిలో  వ్యాసం రాసేశాను.  మర్నాడు ఉత్సాహంగా  తీసుకువెళ్ళి క్లాసులో  ఆయనకు చూపించాను.  చదివి,  ‘ఇది  నువ్వే రాశావా?’ అంటూ అనుమానంగా  అడిగారు.  ముందు అయోమయం... తర్వాత  కాసింత అవమానం.  ‘నేనే రాశా’నంటూ  తలూపాను.  దానిలో ఒక దోషం సరిదిద్ది,  నోట్సును చేతికిచ్చి వెళ్ళమన్నారు. 

కొంతకాలం తర్వాత కాలేజీ ఆవరణలో మిత్రులతో  పిచ్చాపాటీలో ఉండగా నన్నుద్దేశించి మాట్లాడుతూ ‘సాక్షాత్తూ ఎమ్వీయల్ గారే  మెచ్చుకున్నారం’టూ సుబ్బారావు అనే మిత్రుడు  నాటి సంఘటనను ప్రస్తావించాడు. ఆశ్చర్యపోయాను.  ఆ రోజు క్లాసులో నాకు లభించింది ప్రశంసేనని అప్పటిదాకా తోచనే లేదు.  మిత్రుడి వ్యాఖ్యతో అప్పటికి నమ్మకం కుదిరి సంతోషపడ్డాను!

ఎమ్వీయల్ గారు ఆ రెండేళ్ళలో  చాలా తక్కువసార్లు మాత్రమే క్లాసులు తీసుకున్నారు.  ఓ క్లాసు చాలా గొప్పగా చెప్పారు.  ఆచంట జానకిరాం గారు ఆధునిక కవిత్వం గురించి రాసిన విమర్శ పాఠమది.  దానిలో మహా ప్రస్థానం రచన తర్వాతికాలంలో  శ్రీశ్రీ  రాసిన ప్రాసక్రీడలు, లిమరిక్కులను చెత్తగా తీసిపారేస్తూ జానకిరాం రాసిన విసుర్లున్నాయి ఆ పాఠంలో. ఎమ్వీయల్ గారు  వాటిని అయిష్టంగా చదువుతూ, కొన్ని పేజీలను స్కిప్ కూడా చేశారు!    

ఇంతకీ ‘ఎమ్వీయల్’ పూర్తి పేరేమిటనే బేతాళ ప్రశ్న అలాగే ఉంది కదా? ఆ చిక్కుముడి విడింది మాత్రం ధర్మఅప్పారావు  కాలేజీలో  చేరాకనే.  అది కూడా వ్యక్తుల ద్వారా కాదు. సీనియర్లను ఎవర్ని అడిగి చూసినా ఎవరూ చెప్పలేకపోయారు. కాలేజీ ఫ్యాకల్టీ వివరాలు ప్రచురించిన పుస్తకం నా సందేహం తీర్చింది. ఆయన అసలు పేరు ‘నరసింహారావు’ అనీ,  ఆ పేరుకు ముందు ఇంటి పేరుతో కలిసివున్న ‘మద్దాలి వెంకట లక్ష్మీ’యే ‘ఎమ్వీయల్’అని!

- వేణు.  
-------------------------------------------------------------
 ప్రముఖ  బ్లాగర్ శ్రీ వేణు గారు పాత్రికేయులు గా పని చేస్తున్నారుhttp://venuvu.blogspot.com/). సెప్టెంబర్ లో - ఒక రోజు బ్లాగ్ మిత్రులు తృష్ణ గారు (http://trishnaventa.blogspot.com/) - "వేణు గారి బ్లాగ్ లో మీ నానారి మీద పోస్ట్ చూసారా " అని వేగు పంపించారు. అది 2009 లో వేణు గారు రాసిన పోస్ట్. అందులో ఆయన నానారి   జ్ఞాపకాలు పంచుకుంటూ - " ఇంటర్నెట్ లో వెతికినా ఎమ్వీయల్ గారి వివరాలు ఎక్కువ లభించడం లేదు" అన్నారు.  
 నేను ఇది చదివిన  రోజు నానారి పుట్టిన రోజు కావడం కేవలం కాకతాళీయం కాదు అని - నా బాధ్యత గుర్తు చేసినట్టు అని - నాకు అనిపించి -   రోజే నానారి బ్లాగ్ మొదలుపెట్టాను సందర్భంగా  బ్లాగ్ పుట్టుక కి కారకులు అయిన  తృష్ణ గారికి,  వేణు గారికి కృతఙ్ఞతలు.
-  రామ్ ప్రసాద్          


4 comments:

  1. http://rajasekhar-dasari.blogspot.com/2011/09/blog-post_29.html
    వేణు గారు ‘ఎమ్వీయల్’ గారి మీద నేను వ్రాసిన బ్లాగ్ చూడండి. మొత్తానికి ఒక చిక్కు ముడి విప్పారు

    ReplyDelete
  2. మాదేం ఉందండి...ఇప్పటికైనా ఎమ్వీఎల్ గారి గురించిన మరిన్ని మంచి విషయాలనూ, వివరాలను తెలుసుకునేందుకు ఈ బ్లాగ్ ఒక మంచి వేదిక కావటం హర్షదాయకం. మంచి ప్రయత్నం మొదలుపెట్టినందుకు మీకు అభినందనలు.

    ReplyDelete
  3. mitrulu mvl gaari sishyakoti lo vokarigaa sri venu - tana guruvu gaariki samarpinchina 'nivaali'lo gurubhakthi gocharamavuthondi. abhinandanalu.-voleti venkata subbarao /vernon hills-IL/USA.

    ReplyDelete
  4. రాజశేఖర్ గారూ

    తృష్ణ గారూ

    ఓలేటి వారూ

    విజిటినందుకు, వీక్షించినందుకూ, వాక్రుచ్చినందుకూ

    వందనాలు

    ReplyDelete