Translate

Thursday, December 8, 2011

తీయని జ్ఞాపకం

బ్లాగ్ మిత్రులు శశిధర్ పింగళి గారు (http://pingali.blogspot.com/)  పంచుకున్న జ్ఞాపకం  ఈ కింద ... శశిధర్ గారికి కృతజ్ఞతలతో.....
--------------------------------------------------------------------------
ఎమ్వీయల్ గారి గురించి చదువుతుంటే వయసు ఓ ముప్పై యేండ్లు వెనక్కి వెళ్ళిపోయింది నిజంగా. అప్పట్లో ఈ ఇంటర్నెట్లూ, టీవీలు వగైరా
ఆధునిక మాధ్యమాలు లేక సరైన సమాచారం తెలియలేదుకాని
వారంటే తెలిసింది ముత్యాలముగ్గుతోనే. ఆనక యువజ్యోతి శీర్షికల
వల్లనే. అప్పట్లో మా బందర్లో సాహితీ గోష్టులు, సమావేసాలు బాగా
జరిగేవి అలాంటి సభలకి తరచు గా చాలా పెద్దలు సి.నా.రె, ఆరుద్ర,
దాశరధి, ఉషశ్రీ లాంటివారు వచ్చినట్లే ఎమ్వీయెల్ గారూ ఓ ప్రత్యేకాకర్షణగా
వచ్చేవారు.(ముత్యాలముగ్గు ఫేమ్ గా. క్షమించాలి అప్పటికంతే తెలుసు
వారిగురించి). నా ఇంటరు డిగ్రీల మధ్యకాలంలో కొంచెం పుస్తకాల
మీద సాహిత్యం మీద అభిరుచి పుట్టి నేనూ కొన్ని చిరు ప్రయత్నాలు
చేసేరోజుల్లొ, యువజ్యోతిలో మినీ కవితలని వారు ప్రోత్సహించే తీరు
తో ధైర్యం తెచ్చుకొని ఉత్తరాలు వ్రాసాను. వాటికి వారే స్వయంగా
జవాబు వ్రాసారు ప్రోత్సహిస్తూ సవరణలు సూచిస్తూ. 
అలా ఓ నాలుగైదు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి మా మధ్య. ఓ రెండుసార్లు
బందరుకొస్తూ నే మీవూరొస్తున్నాను వచ్చి కలువు అని వ్రాసారు. రెండు
సార్లూ వెళ్ళాను కానీ నేనేనని పరిచయంచేసుకోలేకపోయాను.
భయమో, బిడియమో తెలీదు ఇప్పటికీ. అందులో ఒకసారి మా కాలేజీ కే
గెష్టు గా వచ్చి అనర్గళంగా ఓ గంటసేపు మాట్లాడారు.
ఆ వుత్తరాలు చాలాకాలం అపురూపంగా దాచుకున్నాను. ఇప్పటికీ
ఏ పుస్తకాల దొంతరల మధ్యో దొరికినా అశ్చర్యపోనక్కరలేదు.
ఓ తీయని జ్ఞాపకాన్ని వెలికి తెచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ
సవినయంగా.... 



శశిధర్ పింగళి

Saturday, December 3, 2011

నాకు తెలియని నా'నారు' -2

ఈ నెల కౌముది  లో-  వ్యాస కౌముది శీర్షిక లో  ప్రచురింపబడిన నాకు తెలియని నా'నారు'  -2  చదవండి. Link ఈ కింద 

http://koumudi.net/Monthly/2011/december/index.html


శ్రీ కిరణ్ ప్రభ గారికి  కృతజ్ఞతలతో ...

Thursday, November 17, 2011

మరిచిపోలేని మా మాస్టారు ఎమ్వీయల్ గారు

మ్వీయల్ గారు ఇంటర్మీడియట్ లో రెండేళ్ళ పాటు మా లెక్చరర్ అయినప్పటికీ ఆయనతో  వ్యక్తిగతంగా పరిచయం పెంచుకోలేకపోయాను.   అసలా ఆలోచనే  రాలేదు.  ఇప్పుడు తల్చుకుని మాత్రం ఏం లాభం?  ఆయన పాఠాలు విన్న అసంఖ్యాకమైన విద్యార్థుల్లో ఒకడిగా మాత్రమే మిగిలాను.      

ఎమ్వీయల్ గారిని  ప్రత్యక్షంగా  చూడకముందే  ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఆయన నిర్వహించిన  ‘యువజ్యోతి’ శీర్షిక  తెలుసు.  చిలిపి, సరదా, సీరియస్ ప్రశ్నలకు చురకల, చమత్కారాల హుషారు జవాబులు చదివి ఆనందించేవాణ్ణి.  

‘ఎమ్వీయల్’ అని పేరు రాసుకోవటంలోనే ఓ ప్రత్యేకత!  అయితే ఆయన పూర్తి పేరు ఏమిటో తెలిసేది కాదు.  MVL  అనేది అబ్రివియేషన్ అనే ఆలోచనతో దానిలోనే పేరుందని భావించి  ఆ పేరును రకరకాలుగా ఆలోచించటానికి ప్రయత్నించేవాణ్ణి;  ఎవరిని అడిగినా సమాధానం చెప్పలేకపోయేవారు.  ఆంధ్రజ్యోతిలో కూడా ఎమ్వీయల్ అని తప్ప మరే రకమైన వివరమూ ఉండేది కాదు.

‘ముళ్ళపూడి వెంకట’ దాకా ఊహించటం... తర్వాత ‘రమణ’ అనుకోవాలంటే  ‘ఆర్’కు  బదులుగా  ‘ఎల్ ’వచ్చి అడ్డుగా నిలబడేది.  దీనికి తోడు యువజ్యోతి శీర్షికలోనే  ‘మీ పేరు ముళ్ళపూడి వెంకట రమణా?’ అని ఓ పాఠకుడు/ పాఠకురాలు అడగటం.... దానికి ‘ఔను. చిన్నప్పట్నుంచీ నాకు ‘ర’ పలికేది కాదు. ‘ముళ్ళపూడి వెంకట లమణ’ అని పలికేవాణ్ణి. అలా ఎమ్వీయల్ అనే పేరొచ్చింది’’.అంటూ కొంటె సమాధానం చెప్పటం !

దీంతో నా తికమక అలాగే కొనసాగింది, చాలా రోజులదాకా!

లెండింగ్ లైబ్రరీ దగ్గర....
మొదటి సారి ఆయన్ను నా పదో తరగతి పరీక్షలు రాయటానికి  నూజివీడులో కొద్ది రోజులున్నపుడు  చూశాను.  ధర్మ అప్పారావు కాలేజీకి రెండు వీధుల అవతల తెలుగు నవలలు అద్దెకిచ్చే లెండింగ్ లైబ్రరీ ప్లస్  కిళ్ళీ బడ్డీ ఉండేది.  అక్కడకు వెళ్ళి,  ఆ పుస్తకాలను మురిపెంగా  చూస్తూ  సంతోషిస్తూ ఉండగా దూరంగా ఓ వ్యక్తి  అటువైపే  వస్తూ కనిపించారు. కిళ్ళీ కొట్టతను ‘ఆయనే ఎమ్వీయల్ గారు’ అని పక్కనున్న అతనితో  చెప్పారు. వినగానే ఎలర్ట్  అయిపోయాను.  ఆయన  సరాసరి ఆ కిళ్ళీ బడ్డీ దగ్గరకే వచ్చి ఆగారు.   

ఆకర్షణీయమైన రూపం... చురుకైన కళ్ళు...  మొహంలో  గాంభీర్యం!  సాదాసీదా మనిషిలా  కాకుండా  ప్రత్యేకమైన వ్యక్తిలాగా కనిపించారు.  

అంత దగ్గరగా ఆయన వచ్చి నిలబడినప్పటికీ  ఆయన్ను పరిచయం చేసుకునేంత చొరవ, ధైర్యం ఏమాత్రం  లేవప్పుడు.  అలా  పరిచయం చేసుకుని,  నాలుగు మాటలు మాట్లాడవచ్చని కూడా  తెలియదు. (ఆయన యువజ్యోతి గురించి నాకు అప్పటికే తెలుసు కాబట్టి పలకరించటానికి ఆమాత్రం సరిపోతుందసలు.)  పైగా వల్లమాలిన బిడియం  నిలువెల్లా ఆవహించివున్న వయసది.  మౌనంగా  పక్కనుంచి  ఆయన్ను అలా  చూస్తుండిపోయాను.  ఆయన అక్కడ కిళ్ళీ కట్టించుకుని  కొద్ది నిమిషాల తర్వాత అక్కణ్నుంచి కదిలి, బహుశా కాలేజీ దారిలోనే ముందుకు సాగిపోయారు! 

తర్వాత కొద్ది రోజులకు నూజివీడులోనే  కాలేజీ వార్షికోత్సవానికి సరదాగా మిత్రుడితో కలిసి వెళ్ళాను. దూరంగా ఉన్న  వేదిక మీద ముఖ్య అతిథి  జంధ్యాల. దర్శకుడిగా ఆయన  తొలిచిత్రం- ‘ముద్ద మందారం (1981) ’రూపొందించిన  సమయమది. అప్పటికింకా సినిమా  విడుదల కాలేదనుకుంటాను.  ఆ కార్యక్రమంలో జంధ్యాల ఏం మాట్లాడారో జ్ఞాపకం లేదు కానీ, ఎమ్వీయల్ గారు జంధ్యాలను పరిచయం చేస్తూ చేసిన  ప్రసంగం గుర్తుంది. అలా ఆయన  ఉపన్యాసం తొలిసారిగా విన్నాను.  జంధ్యాల విశిష్టతను చెపుతూ ఉపయోగించిన ‘రస ప్లావితం’అనే మాట బాగా గుర్తు.

నూజివీడు లాంటి చిన్న పట్టణంలోని కాలేజీ ప్రోగ్రాంకి  సినీ, సాహిత్య  ప్రముఖులు ప్రతి సంవత్సరం హాజరయ్యేవారంటే దానికి  ఎమ్వీయల్ గారితో వారికున్న  పరిచయాలే  కారణం! 

టెన్త్ ఫలితాలు వచ్చాక మా ఊరికి  30 కిలో మీటర్ల దూరంలో ఉన్న  నూజివీడు కాలేజీ లోనే ఇంటర్లో చేరాను.  అక్కడ ఎమ్వీయల్ గారు లెక్చరర్ అని తెలుసు కాబట్టి  బాగా ఉత్సాహం.  ఆయన తరగతులు వినాలనే ఆసక్తితో  సంస్కృతాన్ని కాదనుకుని  తెలుగును రెండో భాషగా తీసుకున్నాను.

అనుమానం.. ప్రశంస
ఆయన మొదటిసారి మా ఇంటర్మీడియట్ క్లాసుకు వచ్చినపుడు ఓ సంఘటన జరిగింది. 

పాఠం చెప్పి,  దాని ఆధారంగా  వ్యాసం రాసుకురమ్మన్నారు.  అప్పటికే  కథలూ, నవలలూ  బాగా చదివే అలవాటు ఉండటం వల్ల  అదే ధోరణిలో  వ్యాసం రాసేశాను.  మర్నాడు ఉత్సాహంగా  తీసుకువెళ్ళి క్లాసులో  ఆయనకు చూపించాను.  చదివి,  ‘ఇది  నువ్వే రాశావా?’ అంటూ అనుమానంగా  అడిగారు.  ముందు అయోమయం... తర్వాత  కాసింత అవమానం.  ‘నేనే రాశా’నంటూ  తలూపాను.  దానిలో ఒక దోషం సరిదిద్ది,  నోట్సును చేతికిచ్చి వెళ్ళమన్నారు. 

కొంతకాలం తర్వాత కాలేజీ ఆవరణలో మిత్రులతో  పిచ్చాపాటీలో ఉండగా నన్నుద్దేశించి మాట్లాడుతూ ‘సాక్షాత్తూ ఎమ్వీయల్ గారే  మెచ్చుకున్నారం’టూ సుబ్బారావు అనే మిత్రుడు  నాటి సంఘటనను ప్రస్తావించాడు. ఆశ్చర్యపోయాను.  ఆ రోజు క్లాసులో నాకు లభించింది ప్రశంసేనని అప్పటిదాకా తోచనే లేదు.  మిత్రుడి వ్యాఖ్యతో అప్పటికి నమ్మకం కుదిరి సంతోషపడ్డాను!

ఎమ్వీయల్ గారు ఆ రెండేళ్ళలో  చాలా తక్కువసార్లు మాత్రమే క్లాసులు తీసుకున్నారు.  ఓ క్లాసు చాలా గొప్పగా చెప్పారు.  ఆచంట జానకిరాం గారు ఆధునిక కవిత్వం గురించి రాసిన విమర్శ పాఠమది.  దానిలో మహా ప్రస్థానం రచన తర్వాతికాలంలో  శ్రీశ్రీ  రాసిన ప్రాసక్రీడలు, లిమరిక్కులను చెత్తగా తీసిపారేస్తూ జానకిరాం రాసిన విసుర్లున్నాయి ఆ పాఠంలో. ఎమ్వీయల్ గారు  వాటిని అయిష్టంగా చదువుతూ, కొన్ని పేజీలను స్కిప్ కూడా చేశారు!    

ఇంతకీ ‘ఎమ్వీయల్’ పూర్తి పేరేమిటనే బేతాళ ప్రశ్న అలాగే ఉంది కదా? ఆ చిక్కుముడి విడింది మాత్రం ధర్మఅప్పారావు  కాలేజీలో  చేరాకనే.  అది కూడా వ్యక్తుల ద్వారా కాదు. సీనియర్లను ఎవర్ని అడిగి చూసినా ఎవరూ చెప్పలేకపోయారు. కాలేజీ ఫ్యాకల్టీ వివరాలు ప్రచురించిన పుస్తకం నా సందేహం తీర్చింది. ఆయన అసలు పేరు ‘నరసింహారావు’ అనీ,  ఆ పేరుకు ముందు ఇంటి పేరుతో కలిసివున్న ‘మద్దాలి వెంకట లక్ష్మీ’యే ‘ఎమ్వీయల్’అని!

- వేణు.  
-------------------------------------------------------------
 ప్రముఖ  బ్లాగర్ శ్రీ వేణు గారు పాత్రికేయులు గా పని చేస్తున్నారుhttp://venuvu.blogspot.com/). సెప్టెంబర్ లో - ఒక రోజు బ్లాగ్ మిత్రులు తృష్ణ గారు (http://trishnaventa.blogspot.com/) - "వేణు గారి బ్లాగ్ లో మీ నానారి మీద పోస్ట్ చూసారా " అని వేగు పంపించారు. అది 2009 లో వేణు గారు రాసిన పోస్ట్. అందులో ఆయన నానారి   జ్ఞాపకాలు పంచుకుంటూ - " ఇంటర్నెట్ లో వెతికినా ఎమ్వీయల్ గారి వివరాలు ఎక్కువ లభించడం లేదు" అన్నారు.  
 నేను ఇది చదివిన  రోజు నానారి పుట్టిన రోజు కావడం కేవలం కాకతాళీయం కాదు అని - నా బాధ్యత గుర్తు చేసినట్టు అని - నాకు అనిపించి -   రోజే నానారి బ్లాగ్ మొదలుపెట్టాను సందర్భంగా  బ్లాగ్ పుట్టుక కి కారకులు అయిన  తృష్ణ గారికి,  వేణు గారికి కృతఙ్ఞతలు.
-  రామ్ ప్రసాద్          


Tuesday, November 15, 2011

నాకు తెలియని నా 'నారు' -1

ఈ నెల కౌముది  లో-  వ్యాస కౌముది శీర్షిక లో  ప్రచురింపబడిన నాకు తెలియని నా'నారు'  
మొదటి భాగం  చదవండి. Link ఈ కింద

http://www.koumudi.net/Monthly/2011/november/index.html

శ్రీ కిరణ్ ప్రభ గారికి  కృతజ్ఞతలతో ...

Sunday, November 13, 2011

లేఖ

శ్రీ ఓలేటి వెంకట సుబ్బారావు గారు 2000 లో  విజయవాడ లో SE గా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం America లో ఉంటూ తనకి ఇష్టమయిన సాహిత్య పఠనం  సాగిస్తున్నారు. నానారి జ్ఞాపకాలతో ఆయన నాకు రాసిన లేఖ blog లో post చేయడానికి అనుమతి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలతో....

......................................................................
చిరంజీవి రామ్ ప్రసాద్ ని
ఆశీర్వదించి వ్రాయునది
నేను ధవళేశ్వరం లో - 1971 -77  మధ్య కాలం లో   గోదావరి బరాజ్   లో ఇంజినీర్ గా చేసాను. సీతారాముడు  అని పిలవబడే  BVS  రామారావు గారు  నేను  కొలీగ్స్ .సీతారాముడు గారు  బాపు  గారు, రమణ గారు  మద్రాస్  లో స్కూల్ లో చదువుకునే రోజులనుండీ  స్నేహితులు. వీరు, నండూరి రామ మోహన రావు గారు, పులిదిండి రాజు గారు , ఎమ్వీఎల్   అంతా ఒకే బృందం. గోదావరి మీద సినిమా షూటింగ్ పని మీద తరచూ  అక్కడికి వచ్చేవారు. మేమంతా  అక్కడ రకంగా  ధవళేశ్వరం,రాజమండ్రి లలో  సరదాగా  కలుస్తూ వుండే వాళ్ళం.  వీరిలో ఒక్క బాపు గారితో మాత్రం నాకు అంతకు ముందే పరిచయం.తరువాత మా కలయిక లద్వారా అందరమూ  'దగ్గర' అయ్యాము.
ఇక నాన్న గారు - నేను- మా మధ్య 'స్నేహం'- గురించి--కొన్ని  తీపి తలపులు.
ఒకసారి :
ధవళేశ్వరం Inspection Bungalow  లో అందరమూ కలిసాము.అప్పటి మన రాష్ట్ర ముఖ్య మంత్రి    శ్రీ పి. వి.నరసింహారావు గారికి  ఢిల్లీ నుంచి పిలుపు వచ్చి అక్కడ  కాంగ్రెస్ పార్టి  అధ్యక్షులుగా నియమింప బడడం తో -ఇక్కడ రాష్ట్రం లో తరువాత  ముఖ్యమంత్రి ఎవరా అన్న చర్చ వీరి మధ్య మొదలు అయింది. అందరూ కింద తివాచీ మీద వలయాకారం లో   కూర్చుని వేడిగా- వాడిగా చర్చిస్తున్నారు.  వీరిలో ఒకరు - " ఎలా మనం సినిమా వాళ్ళం గనుక మనకు ఉపయోగం ఉండేలా- మన 'రాజు' గారినే ( పులిదిండి రాజు గారు) ముఖ్య మంత్రి చేస్తే సరిపోలే !" అన్నారు. అందుకు రమణ గారు స్పందిస్తూ " రాజు గారు రాజు గారే అవుతారు గానీ మంత్రి ఎలా అవుతారు ?!" అంటూ  చమత్కరించారు.  అందరూ  వెంటనే పకపకలు-!
ధవళేశ్వరం  NGO  క్లబ్  వారు   బాడ్మింటన్  పోటీలను నిర్వహించి- చివరి రోజున   - బహుమతి ప్రదానోత్సవ  సభ జరిపి  విజేతలను  సత్కరించారు.  సభకు  రాజమండ్రి నుండి -శ్రీ నాగేశ్వర రావు గారని - Commercial   Taxes  Officer  ని అధ్యక్షులు  గా  ఆహ్వానించారు. ప్రధాన వక్త శ్రీ ఎమ్ వి ఎల్  మాట్లాడుతూ"  "పనుల  భారం లోనూ-పన్నుల  భారం లో నూ   వున్నా -మా ఆహ్వానాన్ని మన్నించి  వచ్చి - సభకు  అధ్యక్షత  వహించిన  శ్రీ నాగేశ్వర రావు గారికి  మా కృతజ్ఞతలు ..." అనగానే సభికుల నుండి కర తాళ ధ్వనులు.!!
'ముత్యాల ముగ్గు' చిత్రీకరణ రోజులలో- రాజమండ్రి వెళ్ళే దారిలో - నిడమర్తి వారి స్టూడియో  ( పాత బంగ్లా ) ఉండేది. అందులో వీరందరి మకాము. నేను అక్కడ కు వెళ్లి  అందరినీ ( నాన్న గారిని కూడా) కలిసేవాడిని. పరిచయం   - 'స్నేహం' గా మారింది నాన్నగారు సంభాషణలు  వ్రాసిన  ' స్నేహం  ' తో. దాని చిత్రీకరణ   గోదావరి ఒడ్డు - రామ పాదాల రేవు దగ్గర నా అధీనం లో ఉన్న లాంచి, స్టీమర్, పడవలు ( పంట్స్ అంటారు- నావ లు)  వీటి పైన జరిగింది. రకం గా అందులో కొంత  నా ' హస్తం' కూడా  లేక పోలేదు.  మన ముళ్ళపూడి వెంకట రమణ గారు రోజు వాళ్ళ పిల్లలు  వర-అనురాధ లను కూడా అక్కడ కు తెచ్చి వాళ్ళను లాంచి ఎక్కించి నాకు పరిచయం చేసారు.బాపు గారు- నాన్న గారు కూడా వున్నారు.
అపట్లో నాన్న గారు  వ్రాసిన పుస్తకాలు అనేకం ' కానుక- రమణ గారి సాహిత్యం పైన  పరిశోధన '-  ఎమెస్కో  ప్రచురణలు - మెరుపులు - మరకలు, గోరంత దీపం , భక్త కన్నప్ప  సినిమా వెండి తెర  నవలలు,  తెలుగు లో పంచ మహాకావ్యాల పైన  సమీక్ష - (ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య ఎకాడమీ ప్రచురణలు)  నా దగ్గర వున్నాయి.'యువజ్యోతి'  ఆంధ్రజ్యోతి  లో ఆయన కాలం -  లో ఆయన 'మార్కు' హాస్యం- పారడీ లు  కనబడేవి.
తరువాత - నాకు బాగా జ్ఞాపకం- ఆయనా- నేను - నూజివీడు లో కలుసుకోవడం. నేను ఆయనతో ఆయన కాలేజ్ కి వెళ్ళడం ఆయన ఉపన్యాసాన్ని - వెనక బెంచి లో కూర్చుని దొంగ చాటు గా వినడం - తరువాత ఇద్దరమూ  మీ ఇంటికి రావడం. మీ అమ్మ గారు వేడి వేడి గా  అన్నం వండి  చక్కగా గోంగూర పప్పు చేసి   వడ్డించారు. భోజనం లో  మరో  స్పెషల్  మామిడి పళ్ళు నూజివీడు రసాలు. అప్పటికి  పిల్లలు  మీ ఇద్దరు చిన్న వాళ్ళు . - మేము ఇద్దరమూ కలిసి విజయవాడ వెళ్లి ఏలూరు  రోడ్ లో  అనేక బుక్ షాప్స్  కి వెళ్లి  - క్రొత్త గా మేము ధవళేశ్వరం లో మొదలు పెట్టిన  లైబ్రరీ  కోసమని పుస్తకాలను  కొన్నాము.
  అలా పరిచయం - స్నేహం గా  రూపొంది- కాలక్రమేణా బలపడింది. అడపా తడపా  ఉత్తర ప్రత్యుత్తరాలు   మా మధ్య నడిచేవి.. ప్రభవ అనుకుంటాను. ఆయన సంపాదకత్వం లో  మొదలు పెట్టడం - తరువాత  ఒకటి -రెండు ఉత్తరాలు..!!!
రకం గా మీ నాన్న గారు  - నాకు ఆప్త మిత్రులు అయిన  శ్రీ ఎమ్ వి ఎల్  గారి గురించి స్మరించుకునే అవకాశం లభించి నందుకు  ఆనందం గా ఉంది..

ప్రేమతో -ఆశీస్సులతో -
ఓలేటి వెంకట సుబ్బారావు